పెళ్లింటి లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
కోనసీమ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు - అత్తిలి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన పోతంశెట్టి వెంకట బసివిరెడ్డి(23) ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణ చెరువు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఫైనాన్స్ వ్యాపారం చేసే బసివిరెడ్డి గ్రామాల్లో డబ్బులు ఇచ్చి వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం వసూళ్లకు వెళ్తుండగా ఆలమూరు శివారు భగ్గేశ్వరం డ్రెయిన్ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కన్నుమూశాడు.
నెల రోజుల కిందటే బసివిరెడ్డికి నిశ్చితార్థమైంది. సెప్టెంబరు నెలలో వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చియించుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం గ్రామాంతరం వెళ్లిన కుమారుడు తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.