శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (10:12 IST)

వైఎస్సార్ జయంతి నేడు: ఇడుపులపాయకు కుటుంబ సభ్యులు

ysrcp
వైఎస్సార్ జయంతి నేడు. ఆయనకు నివాళి అర్పించేందుకు కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న వారికి వైసీపీ జిల్లా నేతలు స్వాగతం పలికారు. 
 
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి.. వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారు అక్కడ నుంచి నేరుగా ఇడుపుల పాయకు చేరుకున్నారు.
 
సీఎం జగన్ తో పాటుగా కుటుంబ సభ్యులు వైఎస్సార్‌కు నివాళి అర్పించనున్నారు. కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీరంతా ఒకే చోటకు చేరటం రాజకీయంగానూ.. వైఎస్సార్ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. 
 
గత సెప్టెంబర్‌లో వైఎస్సార్ వర్దంతి నాడు సైతం కుటుంబ సభ్యులు అందరూ కలిసి నివాళి అర్పించి.. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అయితే, గురువారం రాత్రి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులు కలిసి డిన్నర్ చేసినట్లుగా తెలుస్తోంది. 
 
రాజకీయంగా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటం.. అందుకు సీఎం జగన్ ఆమోదం తెలపకోవటంతో కొంత కాలంగా గ్యాప్ ఏర్పడింది. పార్టీ ఏర్పాటు తరువాత తన అన్న ఏపీ సీఎంగా ఆ రాష్ట్రం కోసం పని చేస్తారని.. తాను తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని షర్మిల స్పష్టం చేసారు. 
 
ఇక, తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల తాత్కాలిక బ్రేక్ ఇచ్చి ఇడుపుల పాయకు చేరుకున్నారు. తిరిగి ఈ నెల 10వ తేదీ నుంచి తన పాదయాత్ర కొనసాగించనున్నారు. 
 
తల్లి విజయమ్మ సైతం కుమార్తె రాజకీయ ప్రస్థానంలో తోడుగా నిలుస్తున్నారు. అదే సమయంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా పార్టీ ప్లీనరీకి హాజరవుతున్నారు.