శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. ఏపీ టూరిజం
Written By Eswar
Last Modified: మంగళవారం, 5 ఆగస్టు 2014 (16:58 IST)

పర్యాటక ప్రేమికుల కోసం అరుకు అందాలకు మరిన్ని మెరుగులు.....

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో కొత్త అందాలు మురిపిస్తున్నాయి. సహజసిద్ధ అందాల్ని టూరిస్టులకు కొత్తగా పరిచయం చేస్తోంది పర్యాటక శాఖ. రాష్ట్ర విభజన తర్వాత టూరిజమ్ కేంద్రాలపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్... అరకులోని ట్రైబల్ మ్యూజియాన్ని మనోహరంగా తీర్చిదిద్దుతోంది.
 
జాలువారే జలపాతాలు... పూలజల్లులా కురిసే వానచినుకులు... తెరలు తెరలుగా కమ్ముకునే పొగమంచు... ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... ఇవన్నీ ప్రముఖ పర్యాటక కేంద్రం అరకువ్యాలీ సొంతం. ఆంధ్రా ఊటీగా లక్షల మంది టూరిస్టులను ఆకర్షిస్తున్న అరకు వ్యాలీకి... కొత్త సొగసులు అద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అడవి తల్లే ఆలంబనగా బతికే గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు... పర్యాటకులకు పరిచయం చేయాలని సంకల్పించింది. 
 
గిరిజన మ్యూజియం అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పూర్వవైభవం కోల్పోతున్న మ్యూజియంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. పాడైపోయిన శిల్ప కళాకృతులను జీవం ఉట్టిపడేలా వివిధ రకాల రంగులతో తీర్చిదిద్దుతున్నారు. కొత్తదనం కోరుకునే వారిని ఆకర్షించేందుకు మ్యూజియం ఎంట్రన్స్ ఆర్చ్‌ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. అలాగే, మ్యూజియం లోపల మట్టిబొమ్మలకు స్వస్తి పలికారు. మట్టితో తయారు చేసిన బొమ్మలు కొద్దికాలానికే కళావిహీనంగా మారుతుండటంతో... ఫైబర్ బొమ్మలను మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బెంగాల్ పర్యాటకులను అరకు హిల్ స్టేషన్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో వున్న కొండలు, లోయల్లో విహారం మరచిపోలేని అనుభూతి. ఐతే, కొన్నేళ్ళుగా ఏపీ టూరిజమ్ వ్యాపార సంస్థగా ఆలోచించడంతో పర్యాటక కేంద్రాలు అభివ్ర్రద్ధికి నోచుకోలేదు. 
 
ఫలితంగా ఒకసారి అరకు వ్యాలీని సందర్శించిన పర్యాటకులకు....అక్కడి వాతావరణం మినహాయిస్తే ఆకట్టుకునే ప్రదేశాలు కరువైన ఫీలింగ్ కలుగుతోంది. టూరిస్ట్ లను తిరిగి ఆకర్షించేందుకు కొత్తకొత్త ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఐటీడీఏ పీవో వినయ్ చంద్ చొరవ తీసుకోవడంతో పదిలక్షల రూపాయలతో ట్రైబల్ మ్యూజియం కొత్త అందాలను సంతరించుకుంటోంది.