ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ జోరు... లగడపాటి ఆర్జీవీ ఫ్లాష్ సర్వే

Last Updated: ఆదివారం, 19 మే 2019 (19:04 IST)
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది.

తుదివిడతలో 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా, ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో వేలూరు స్థానం ఎన్నిక రద్దు అయింది. ఈ ఎన్నికను రద్దు చేసినట్లు ఇటీవలే అధికారులు ప్రకటించారు.

కాగా, తుది విడత పోలింగ్‌లో సాయంత్రం 6 గంటల వరకు యూపీలో 54.37 శాతం, పంజాబ్‌లో 58.81 శాతం, మధ్యప్రదేశ్‌లో 69.38, బెంగాల్‌లో 73.05, హిమాచల్ ప్రదేశ్‌లో 66.18 పోలింగ్ నమోదైంది.

ఇకపోతే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని వెల్లడించారు.

లగడపాటికి చెందిన ఆర్జీ ఫ్లాష్ సంస్థ నిర్వహించిన సర్వేలో అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీకి వంద సీట్లు (పది ప్లస్ లేదా మైనస్), ప్రతిపక్ష వైకాపాకు 70 (ఆరు సీట్లు ప్లస్ లేదా మైనస్) సీట్లు రావొచ్చని వెల్లడించారు. ఇకపోతే, సినీ జీవితాన్ని వదులుకుని ప్రజాజీవితంలోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి పది నుంచి 12 సీట్లు రావొచ్చని తెలిపారు.

ఇక లోక్‌సభ స్థానాలను పరిశీలిస్తే మొత్తం 25 సీట్లకుగాను తెలుగు దేశం పార్టీ 15 సీట్లు (రెండు సీట్లు తగ్గొచ్చు (13) లేదా పెరగవచ్చు(17)) వస్తాయని వెల్లడించారు. అలాగే, వైకాపాకు 10 సీట్లు (రెండు తగ్గొచ్చు లేదా పెరగవచ్చు), జనసేనకు ఒక లోక్‌సభ స్థానం గెలుచుకోవచ్చని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలను వెల్లడించారు. ఇందులో అధికార తెరాసకు 14 నుంచి 16 ఎంపీ సీట్లు రావొచ్చని వెల్లడించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదా రెండు సీట్లు, బీజేపీకి సున్నా లేదా ఒక్క స్థానం లభిస్తాయని, ఎంఐఎంకు ఒక స్థానం వస్తాయని ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, టీడీపీకి 43 -45 శాతం ఓట్లు సాధిస్తుందని, వైకాపాకు 40 నుంచి 42 శాతం, జనసేన పార్టీకి 10 నుంచి 12 శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపారు. ఒక్కో సెగ్మెంట్‌లో 1200 మంది ఓటర్లను శాంపిల్స్‌గా తీసుకుని ఈ ఫలితాలను అంచనా వేసినట్టు లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.

ఇక కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావొచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా, సీ ఓటరు, రిపబ్లిక్ టీవీ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. సీ ఓటరు సర్వేలో ఎన్డీయేకు 287, యూపీపీఏకు 128, ఇతరులకు 87 సీట్లు వస్తాయని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ సర్వే నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 305, యూపీఏ 124, ఇతరులు 84, ఎస్పీ, బీఎస్పీ కూటమికి 42 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.
దీనిపై మరింత చదవండి :