గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:53 IST)

స్నేహమంటే ఇదేనా? అలీ వంటి వ్యక్తులతో బంధుమిత్రులను కూడా నమ్మడం లేదు : పవన్

సినీనటుడు, వైకాపా నేత అలీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ వంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు. ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కష్టాల్లో అలీకి అండగా ఉన్నానని, ఆయన చెప్పినవారికి టికెట్లు ఇచ్చానని.. అయినా ఆయన జగన్‌తో చేతులు కలిపారన్నారు. 
 
స్నేహమంటే ఇదేనా అని పవన్ ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేస్తానన్న అలీ.. మాట మత్రమైనా చెప్పకుండానే వైసీపీలో చేరిపోయారన్నారు. అలీ లాంటి వారి వల్ల.. ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. అదేసమయంలో అలీ చెప్పిన ఆయన బంధువుకు నరసారావు పేట ఎంపీ టిక్కెట్ కేటాయించామన్నారు. ఆయనకు మద్దతుగా తాము ప్రచారం చేస్తుంటే.. అలీ మాత్రం వైకాపా తరపున ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదెక్కడి న్యాయం అని పవన్ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, అలీనీ వైకాపా నేతలు వాడుకున్నారన్నారు. అలీకి ఎంపీ టికెట్‌ ఇస్తామంటే వైసీపీలో చేరాడని తెలిపారు. పైగా, అలీ వైకాపాలో చేరడానికి కారణం... ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. జగన్ గెలుస్తాడు అని భావించి ఉండొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా అలీ వంటి వ్యక్తుల వల్ల చివరకు బంధుమిత్రులను తాను నమ్మడం లేదనీ ప్రజలను మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పారు.
 
ఇకపోతే, వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్‌ రాష్ట్రానికి అవసరమా? అని మరోసారి ప్రశ్నించారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. వైఎస్‌ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి  సినిమా తీయాలని బెదిరించారని, జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా?.. బెదిరిస్తే తోలు తీస్తానని పవన్‌ హెచ్చరించారు.