మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది... అది నాతోనే ప్రారంభం
మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుందని అది తనతోనే మొదలైందని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన గట్టిపోటీని ఎదుర్కొని విజయం సాధించారు. పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోయారు. కానీ, రాపాక ప్రరప్రసాద్ మాత్ర జగన్ సునామీని తట్టుకుని విజయం సాధించారు.
మల్కిపురం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక 2009లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 30 ఏళ్లుగా క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరిగా జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాపాక విజయంలో ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపు, క్షత్రియ సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విజయం ఆనందంగా ఉందన్న ఆయన మార్పు ఎప్పుడూ ఒకరితోనే మొదలవుతుందని తమ అధినేత నమ్ముతారని ఆ మార్పే ఇప్పుడు మొదలైందన్నారు. 2024లో విజయం మాదేనని ఆయన అంటారు. మరి రాపాక చివరి వరకు జనసేనలోనే ఉంటారా లేక జగన్ చెంతకు చేరుతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.