ఆయాసం, అలసట తగ్గాలంటే రోజూ ఉసిరిక్కాయ తినండి...
మనం రోజూ తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయనేది సందేహమే. పోషకాల లోపం వలన వచ్చే వ్యాధులకు పిల్లలు పెద్దలు అనేక మందులు వాడుతుంటారు. ఇలా మందులు వాడితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. పైగా ఖర్చు కూడా ఎక్కువవుతుంది. సాధారణంగా పెరటిలో దొరికే ఉసిరికాయతో మనకు అనేక పోషకాలు అందుతాయి. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల పలు రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది.
పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడురెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి. దానిమ్మపండుతో పోలిస్తే ఉసిరిలో పోషకాలు దాదాపు 27 రెట్లు ఉంటాయి. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీమైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన క్రొవ్వును కరిగించడమే కాక రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. ఉసిరికాయ తింటే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయాసం, అలసటను తగ్గిస్తుంది. మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది. జుట్టుకు సరైన పోషణను అందించి, చుండ్రుతో సహా అనేక కేశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది, మచ్చలను నివారిస్తుంది. ఉసిరికాయను ముద్దగా నూరి కొద్దిగా పసుపు, నువ్వుల నూనెను కలిపి శరీరానికి రాసుకుని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతూ యవ్వనంగా కనిపిస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ ఉసిరిపొడిలో తేనెను కలిపి తింటే, అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట తగ్గుతుంది. ఉసిరి రక్తాన్ని కూడా శుద్ధి చేయగలదు.