శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (12:15 IST)

జస్ట్ త్రీడేస్... హోరాహోరీగా ప్రచారం.. సుడిగాలి పర్యటనల్లో నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మిగిలిన సమయం కేవలం మరో మూడు రోజులు మాత్రమే. ఈనెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్‌కు ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుంది. దీంతో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 
 
పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో రేయనకపగలనక ప్రచారం చేస్తున్నారు. ప్రచార సభలు, రోడ్డుషోలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఇంకా ప్రచారం నిర్వహించని ప్రాంతాలపై దృష్టిపెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన 'బూత్‌ మేనేజ్‌మెంట్‌'పై వ్యూహాలు రచిస్తున్నారు. 
 
పోలింగ్ సమీపిస్తుండటంతో అభ్యర్థులు చివరి అస్త్రంగా ప్రలోభాలను ముమ్మరం చేశారు. పోటాపోటీగా ఓటర్లను డబ్బులు, మద్యం, కానుకలతో ముంచేస్తున్నారు. పోలింగ్‌కు మిగిలిన చివరి నాలుగు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హోరాహోరీగా పోటీ నెలకొన్నస్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు వరకు ముట్టజెబుతున్నారు. 
 
తెలంగాణలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో పోలింగ్‌ వేళలను తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరగనుంది.
 
ఓటింగ్‌ శాతం తగ్గితే గెలుపోటములపై ప్రభావం ఉంటుందని ప్రధాన పార్టీల అభ్యర్థులు బెంగపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని పార్టీల నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తామే గెలుస్తామని ఒకరంటే.. కాదు తాము గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.