శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (18:04 IST)

వయనాడ్‌లో రాహుల్ వర్సెస్ రాహుల్.. పాకిస్థాన్ జెండా ఎగురవేశారా?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాయనాడ్‌‌లో రాహుల్ గాంధీకి ప్రత్యర్థి ఎవరనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ద రచ్చ జరుగుతోంది. 
 
ఎందుకంటే.. వయనాడ్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీనే. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అవును.. ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి పేరు కూడా రాహుల్ గాంధీయే కావడం విచిత్రం. అగిల ఇండియా మక్కల్ కళగమ్ పార్టీకి చెందిన కేఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేతపై పోటీచేస్తున్నారు.  
 
ఇక రాహుల్ గాంధీ ప్రత్యర్థి కేఈ రాహుల్ గాంధీకి ఓ సోదరుడు ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీకి ఓ కుమార్తె ఉండగా, ఆమె పేరు ఇందిరా గాంధీ కావడం మరో విచిత్రం. ఏదేమైనా హస్తం గుర్తు తప్ప పేర్లన్నీ గాంధీల కుటుంబానికి దగ్గరగా ఉండడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే కేరళలో ముస్లిం లీగ్‌తో పొత్తు కుదుర్చుకున్న రాహుల్ వాయనాడ్‌లో తనకు మైనారిటీ ఓట్లు బాగా పడతాయని భావిస్తున్నారు.
 
మరోవైపు సోషల్ మీడియాలో వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ఎగరేశారంటూ పోస్ట్ చేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ కార్యాలయానికి కూడా ఇస్లామిక్ రంగు వేశారని చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం వివాదం రేగింది. వయనాడ్ స్థానంలో ఓటర్ల సంఖ్య గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.