శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By

రాహుల్ డబ్బులిస్తే భార్యకు భరణం చెల్లిస్తా : కోర్టులో భర్త కౌంటర్

సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని 20 శాతం అత్యంత నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత పథకం కింద నెలకు రూ.6 వేలు చొప్పున ఒక యేడాదికి రూ.72 వేలు అందిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ పథకానికి న్యాయ్ అని నామకరణం చేశారు. 
 
ఇపుడు న్యాయ్ పథకానికి సంబంధించిన ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో భార్యకు భరణం చెల్లించాలని ఓ భర్తను కోర్టు ఆదేశించింది. కానీ, ఆ భర్త మాత్రం 'న్యాయ్' సొమ్ము రాగానే చెల్లిస్తానని కోర్టుకు విన్నవించాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
 
భోపాల్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తికి 2006లో దీప్ మాలా అనే మహిళతో వివాహమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు.. భార్యకు నెలకు రూ.3 వేలు, కుమార్తె ఖర్చులకు నెలకు రూ.1500 చొప్పున చెల్లించాలని ఆదేశించింది.
 
దీంతో ఆనంద్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన దగ్గర అంత సొమ్ము లేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకం కింద నెలకు రూ.6,000 ఇస్తామని చెప్పారనీ, దాని నుంచి ఈ భరణాన్ని చెల్లిస్తానని చెప్పాడు. 
 
పైగా, తన బ్యాంకు ఖాతా నుంచి ఈ సొమ్ము నేరుగా భార్యాపిల్లల ఖాతాల్లోకి పడేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేసింది.