బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (17:19 IST)

అసలు మనం దాడి చేసామా..? 300 మందిని చంపామా..? పుల్వామా ప్రితోడా

పుల్వామా ఉగ్రదాడుల తర్వాత, భారత వాయుసేన పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై చేసేసామని చెప్పుకొస్తున్న ప్రతిదాడిలోని వాస్తవికతను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా ప్రశ్నించారు. 
 
రాజకీయ పెనుదుమారం రేపుతున్న ఈ అంశాన్ని గురించి ఆయన ఆంగ్ల వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ ‘‘వారు 300 మందిని చంపితే మంచిదే. కాకపోతే నేను అడిగేది ఒక్కటే.. దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు, వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను న్యూయార్క్‌ టైమ్స్‌, ఇతర పత్రికలు చదివాను. అసలు మనం దాడి చేసామా..? 300 మందిని చంపామా..? నాకైతే తెలియదు. 
 
ఒక పౌరుడిగా అడిగే హక్కు నాకు ఉంది.. నేను  అడుగుతాను. అంత మాత్రాన నేను ఇటు వైపో..అటు వైపో ఉన్నట్లు కాదు. మనకు మరిన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు 300 మందిని చంపితే భారత ప్రజలకు తెలుసుకొనే హక్కు ఉంది. కానీ ప్రపంచ మీడియా మాత్రం అక్కడ ఎవరూ చనిపోలేదనే చెబుతోంది. ఒక భారతీయ పౌరుడిగా నాకు అది ఏమాత్రం బాగోలేదు.’’
 
‘‘నేను గాంధేయ వాదిని. దయా, గౌరవం వంటి అంశాలను నమ్ముతాను. చర్చలపైనే నాకు నమ్మకం ఉంది. పాకిస్థాన్‌తో మాత్రమే దేనికి. మనం ప్రతిఒక్కరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తంతో చర్చించాలి.’’ ‘‘ఇవన్నీ నా వ్యక్తిగతంగా అడుగుతున్నవే. ఒక శాస్త్రవేత్తగా అడుతున్నవి. నేను కారణాలు, లాజిక్‌, ఆధారాలను నమ్ముతాను. నేను భావోద్వేగాలను నమ్మను.’’ అని అన్నారు. 
 
2014 తర్వాత నుండి అమెరికా, భారత్‌లో అధికార పార్టీలు ఎన్నికల కోసం  అనుసరిస్తున్న వ్యూహాలను ఆయన తప్పుపట్టారు. ‘‘సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారనే భయం ప్రజల్లో సృష్టించడం ఇప్పుడు సరికొత్త సూత్రంగా మారిపోయింది. భారత్‌లో అయితే అది పాకిస్థాన్‌ అని చెబుతారు, అమెరికాలో అయితే మెక్సికన్‌ వలసదారులు అని చెబుతారు. సమర్థులు లేకపోవడం వల్ల పరిస్థితులు అన్నీ దారుణంగా ఉన్నాయని అంటారు’’ అని పిట్రోడా విమర్శించారు.