శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (15:50 IST)

ఏపీలో వలంటీర్లపై వేటుపడుతుంది... రాజమండ్రి పరిధిలో 23 మంది సస్పెన్షన్

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు తొత్తులుగా వ్యవహరిస్తున్న గ్రామ వలంటీర్లపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తుంది. ఇప్పటికే 46 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించింది. తాజాగా రాజమండ్రి పరిధిలో మరో 23 మంది వలంటీర్లను సస్పెండ్ చేశారు. వీరంతా అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారందరిని సస్పెండ్ చేస్తూ జిల్లా రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుు జారీచేశారు. ఎన్నికల విధులకు వలంటీర్లు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
అయినప్పటికీ పలువురు వలంటీర్లు వైకాపా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుధవారం కూడా 46 మంది వలంటీర్లను తొలగించిన విషయం తెల్సిందే. వైకాపా నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో ఈ వలంటీర్లు అత్యంత కీలక పాత్రను పోషించడమే కాకుండా, నగదు, బహుమతుల పంపిణీలో కీలకంగా ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి రిటర్నింగ్ అధికారులకు టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. 
 
వైకాపాకు ప్రచారం చేసిన 46 మంది వలంటీర్లపై వేటు : సీఈవో మీనా వెల్లడి 
 
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధికార వైకాపాకు ప్రచారం చేసిన 46 మంది వలంటీర్లపై చర్యలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రెగ్యులర్‌, ఒప్పంద ఉద్యోగులు, గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం నిబంధనలకు విరుద్ధమన్నారు. 
 
గత 3 రోజుల వ్యవధిలో అలాంటి 46 మందిపైన శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకున్నామన్నారు. వారిలో 40 మంది వాలంటీర్లే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. మిగతావారు వీఆర్వోలు, ఇతర ఒప్పంద ఉద్యోగులు అని చెప్పారు. రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొన్న రెగ్యులర్‌ ఉద్యోగుల్ని సస్పెండ్‌ చేశామని గుర్తు చేశారు. ఒప్పంద ఉద్యోగులు, వాలంటీర్లను తొలగించామని, స్వయంగా రాజకీయ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపైన క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 
 
మరికొంతమందిపైనా ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వినియోగించొద్దని, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించొద్దని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా తాజాగా తొలగించిన, కేసులు నమోదైన వాలంటీర్లు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండొచ్చా లేదా అనే దానిపై సరైన సమయంలో నిర్ణయం చెబుతామన్నారు.