పవన్ పంటి కింద రాయి, విజయవాడ పశ్చిమ పోతిన మహేష్: సుజనా చౌదరి సిద్ధమవుతున్నారా?
విజయవాడ పార్లమెంటు స్థానంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో కూడా అటు ఎన్డీయే ఇటు వైసిపి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో జనసేన పార్టీ నుంచి టికెట్ కోసం పోతిన మహేష్ ఆశలు పెట్టుకున్నారు. ఐతే పొత్తుధర్మం ప్రకారం ఆ సీటు భాజపాకి వెళ్లిపోయింది. ఐనప్పటికీ పోతిన మాత్రం తన పట్టు వదలడంలేదు.
ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి వీధిలోని ప్రజలతో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయనీ, ఎలాంటి సమస్య వచ్చినా అంతా తన వద్దకే వస్తుంటారనీ, సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేసింది కూడా తనేనంటూ చెప్పుకుంటున్నారు. జనసేన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక విజయవాడ పరిధిలో ఏ ఒక్క జనసేన నాయకుడు లేకుండా పోయారనీ, ఐతే తను ఒక్కడిని మాత్రమే పశ్చిమ నియోజకవర్గంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అలా జనసేన పార్టీని పటిష్టం చేసిన తనకు ఇవ్వకుండా వేరొకరికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే ఈ స్థానం నుంచి మాజీకేంద్ర మంత్రి సుజనా చౌదరి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాన్ని నిజం చేస్తూ కేశినేని నాని విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తి వస్తున్నాడని, అంతా జాగ్రత్తగా వుండాలంటూ హెచ్చరికలు కూడా చేసారు. పనిలోపనిగా పోతిన మహేష్‌కి టిక్కెట్ ఇవ్వకుండా సుజనాకి ఎట్లా ఇస్తారంటూ ట్విస్ట్ ఇచ్చారు. మొత్తమ్మీద చూస్తే పోతిన వ్యవహారం పవన్ పంటి కింద రాయిలా మారుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సీటు తనకే దక్కాలంటూ పోతిన మహేష్ నిరాహార దీక్షకు కూర్చున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.