శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (07:42 IST)

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్... పుంగనూరులో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్

telangana voters
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది.
 
ఈ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ ముగింపు సమయానికి పోలింగ్‌ కేంద్రం లోపల క్యూలైన్‌లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లువుండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్న పోలింగ్‌ కేంద్రాలు 34,651 (74.70 శాతం).
 
మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్‌ కేంద్రాలు పెట్టారు. ఈ దఫా మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
 
అదేవిధంగా దేశంలో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌లలో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, జార్ఖండ్‌‌లో 4 చొప్పున, జమ్ముకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌లో జరుగుతున్న పెద్దఎన్నిక ఇదే. 543 స్థానాలకు గానూ ఇంతవరకు మూడు దశల్లో 283 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. నాలుగోదశతో అది 379కి చేరుతుంది.
 
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా, పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో, టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర‌లను అపహరించారు. దీనిపై టీడీపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.