సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (11:24 IST)

వైఎస్సార్ చేయూత: రూ.19వేల కోట్ల సాయం.. 23,14,342 మంది అర్హులైన..?

ఏపీ వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద రెండో ఏడాది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయనున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. 
 
పేద మహిళలకు నాలుగేళ్లలో దాదాపు రూ.19వేల కోట్ల సాయం అందించే కార్యక్రమం ఈ పథకం ద్వారా చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వరుసగా రెండవ ఏడాది కూడా 23,14,342 మంది అర్హులైన మహిళలకు రూ. 4,339.39 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైస్ జగన్.
 
కాగా, మంగళవారం అందిస్తున్న రూ. 4,339.39 కోట్లతో కలిపి వైఎస్సార్‌ చేయూత కింద ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ. 8,943.52 కోట్లు సాయం అందించింది. ఇదిలాఉంటే.. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ప్రతీ ఏటా రూ. 18,750 చొప్పున వరసగా నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం చేయనున్నారు. 
 
ఎన్నికల హామీ మేరకు సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ఈ నిధులు మహిళలకు ఎంతగానో ఆసరా అవుతాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.