మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:15 IST)

నేలపై పాకుతూ వచ్చిన 11 నెలల చిన్నారి.. కారును పైకి పోనిచ్చి..?

ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 నెలల చిన్నారిపై కారును పోనిచ్చాడు. నేలపై పాకుతూ వచ్చిన ఆ బిడ్డను చూసుకోకుండా డ్రైవ్ చేయడం చిన్నారి ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదల గ్రామానికి చెందిన తోట రమేష్, అనూష దంపతులకు ఇద్దురు కూతుళ్లతోపాటు తోట జశ్వంత్ అనే 11 నెలల కుమారుడు ఉన్నాడు. బతుకు దెరువు కోసం కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌కు వచ్చారు.
 
హైదరాబాద్ లో కొండాపూర్ శ్రీరాంనగర్ బీ బ్లాక్ లో నివాసం ఉంటూ ఉపాధి పనులను చేసుకుంటున్నారు. మంగళవారం వాళ్లు ఉంటున్న ఇంటికి దగ్గరలోనే రోడ్డుపై ఇద్దరు అక్కలు, మరికొందరు పిల్లలతో కలిసి కొడుకును ఆడిస్తున్నారు. 
 
సరిగ్గా అదే సమయంలో తాటి కిరణ్ అనే సివిల్ ఇంజనీర్ కారులో ఆఫీసుకు వెళ్లేందుకు ఉదయం 8.30 గంటల సమయంలో బయలుదేరాడు. పిల్లలు ఉన్న చోటే మూలమలుపు ఉంది. ఆ మూలమలుపు వద్దకు రాగానే కిరణ్ హారన్ కొట్టాడు. దీంతో పిల్లలంతా రోడ్డుపై నుంచి పక్కకు తప్పుకున్నారు. కానీ 11 నెలల చిన్నారి మాత్రం నడవలేక పాకుతూ ఆ పిల్లల వైపు వెళ్తున్నాడు.
 
అయితే పిల్లలంతా పక్కకు వెళ్లిపోయారనే కిరణ్ భావించాడు. నేలపై పాకుతున్న 11 నెలల చిన్నారిని చూసుకోలేదు. అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు ముందు టైరు 11 నెలల జశ్వంత్ పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాల పాలయిన జశ్వంత్ ను స్థానికంగా ఓ క్లినిక్ లో చేర్పించారు. 
 
అక్కడ కూడా కోలుకోకపోవడంతో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతితో ఆ తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు.