సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (08:31 IST)

లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి నష్టం... ఏపీ సీఎం జగన్

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి ప్రభుత్వ అధికారులే అడ్డుకట్ట వేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికీ, సామాన్యప్రజలకూ తీవ్ర ఆర్థికనష్టం తప్పదని అన్నారు. అందువల్ల లాక్డౌన్ వద్దనే వద్దన్నారు. 
 
'లాక్డౌన్‌ వల్ల ప్రభుత్వానికి రూపాయి నష్టం కలిగితే, సామాన్యుడు నాలుగు రూపాయలు కోల్పోతాడు. గతేడాది ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే .. సామాన్యులు దాదాపు రూ.80,000 కోట్లు నష్టపోయినట్టే' అని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వచ్చే కొన్నినెలలపాటు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. 
 
అదేసమయంలో కరోనా నియంత్రణ బాధ్యతను జాయింట్‌ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్సను సమీక్షించాలని, కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 59 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, రోజూ 320-340 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోందని అధికారులు తెలపగా, అవసరమైనవారందరికీ ఆక్సిజన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఆర్థిక కార్యక్రమాలు ఆగరాదన్నారు. కొవిడ్‌పై వదంతులు సృష్టించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అరెస్టులు చేయాలని ఆదేశించారు.