అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో నేడు చర్చ జరగనుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ శ్రేణులు పోలీసులపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సమావేశాల్లో రెండో రోజు భాగంగా అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గామాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రత్తమయ్యారు. రాజధాని గ్రామాల్లో తలదాచుకున్న అరాచకశక్తుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని రాజధాని ప్రాంత వాసులకు పోలీసులు సూచించారు. నిరసనలు ఎవరి గ్రామాల్లో వారు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మా పోరాటం ఆగదు: రైతులు
మూడు రాజధానులకు అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదం తెలపడంపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మందడంలో ఉదయం నుంచి రైతుల నిరసనకు దిగారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు.
సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రి వర్గం ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని రైతులు నిలదీశారు.