సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైకాపా కార్యకర్త ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్లు

delhi liquor bottles
ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాళెం మండలంలోని సత్యవతిపేటకు చెందిన వైకాపా కార్యకర్త కప్పల నారాయణ రెడ్డి ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్ళు లభ్యమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై సోదాలు చేయగా, రూ.1.50 లక్షల విలువ చేసే 277 మద్య సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన వైకాపా కార్యకర్త మారుబోయిన వెంకటేశ్వర రెడ్డి ఢిల్లీలో తక్కువ ధరకు మద్యం సీసాలు కొనుగోలు చేసి రైలులో తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో మద్యం సీసాలు తెచ్చి తన మామ కప్పల నారాయణ రెడ్డితో కలిసి విక్రయించేవారు. 
 
రోజులు గడిచేకొద్దీ... ఈ వ్యాపారంలో ఆదాయం బాగా వస్తుండడంతో ఇద్దరూ ఢిల్లీ వెళ్లి వందల సంఖ్యలో మద్యం సీసాలు కొనుగోలు చేసి సత్యవతిపేటలోని నారాయణ రెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నారు. వాటిని స్థానికంగానే కాకుండా జిల్లాలోని నిజాంపట్నంలోనూ విక్రయించసాగారు. ఢిల్లీలో ఒక్కో సీసా రూ.130 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తూ లాభం గడించసాగారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.