శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (08:42 IST)

భార్యతో గొడవపడి కన్నతల్లిని నీటి కుంటలో పడేసి చంపిన తనయుడు

old woman
భార్యతో గొడవపడిన ఓ భర్త... కన్నతల్లిని నీటి కుంటలో పడేసి నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఈ దారుణ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల జే పంగులూరు మండలం రామకూరు గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన జే.సుబ్బులమ్మ (85) అనే వృద్ధురాలు తన కుమారుడు శ్రీనివాస రావు కటుుంబంతో కలిసి ఉంటుంది. 
 
అయితే, ఈమెకు కోడలితో అసలు పొసగలేదు. ఇటీవలే శ్రీనివాసరావు గ్రామంలో కొత్త ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఆ కొత్త ఇంట్లోకి అత్త కాలుపెడితే తాను ఆ ఇంట్లో ఉండనంటూ తన భర్త శ్రీనివాసరావుకు భార్య షరతు విధించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీనివాస రావు ఎవరూ ఊహించని కిరాతక చర్యకు పాల్పడ్డాడు.
 
బుధవారం బాగా పొద్దుపోయిన తర్వాత తల్లిని ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని ఊరి చివరన ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనను ఎవరూ గమనించలేదని నిర్ధారించుకున్న తర్వాత తల్లిని నీటి కుంటలో తోసేశాడు. మరునాడు పశువుల కాపరు నీటి కుంటలో మృతదేహం ఉండటాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు విషయాన్ని శ్రీనివాస రావు వెల్లడించాడు. దీంతో నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు.