శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (10:18 IST)

బాలికపై మాజీ సైనికోద్యోగుడి అత్యాచారం...

అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కామంతో కళ్లుమూసుకున్న ఓ మాజీ సైనికోద్యోగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేసి మూటగట్టి ఇంట్లోనే పడేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలావున్నాయి. 
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం తన నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లోనే ఉంచి కుమారుడిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లింది. అయితే, తిరిగి వచ్చిన ఆమెకు కుమార్తె కనిపించకపోవడంతో ఇల్లంతా గాలించింది. ఇరుగుపొరుగువారి వద్ద కూడా ఆరా తీసింది. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
 
ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చిన ఆమె మరోమారు ఇల్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్రూంలో ఓ గోనె సంచి కనిపించడంతో విప్పి చూసిన ఆమె షాక్‌కు గురైంది. అందులో తన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. 
 
ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఆమె బంధువు, మాజీ సైనికోద్యోగి అయిన వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.