గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (10:16 IST)

చిత్తూరు జిల్లాలో దారుణం : లోయలోపడిన బస్సు - ఏడుగురు మృతి

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి తిరుచానూరుకు బయలుదేరిన బస్సు ఒకటి లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 63 మంది ఉన్నారు. ఈ ప్రమాదం జిల్లాలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డు సమీపంలో మూల మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి 60 అడుగుల లోతులో పడిపోయింది. 
 
అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్ర నగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాం నిశ్చియమైంది. దీంతో ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం జరగాల్సివుంది. ఇందుకోసం వేణు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ధర్మవరం నుంచి ఓ ప్రైవేటు బస్సులో మొత్తం 63 మందితో తిరుచానూరుకు బయలుదేరారు. 
 
రాత్రి 8 గంటల సమయంలో పీలేరులోని ఓ డాబా వద్ద ఆగి అందరూ భోజనాలు చేసి తిరిగి బయలుదేరారు. అక్కడ నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తుండగా, దొనకోటి గంగమ్మ గుడి దాటిన తర్వాత మూల మలుపు పద్ద బస్సు అదుపు తప్పి 60 అడుగుల లోతోపడిపోయింది. 
 
ఈ ఘటనలో ఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకొందరి కాళ్లు, చేతులు విరిగాయి. కొందరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు వృద్ధులు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం రాత్రి పది గంటల సమయంలో జరగడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాధితుల రోదనలు విన్న కొందరు వాహనదారులు ఆగి లోయలోకి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోయలో చిక్కుకునిపోయిన వారిని రక్షించారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.