1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified మంగళవారం, 22 మార్చి 2022 (21:27 IST)

పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ సక్కర్ జిల్లాలో పూజ అనే 18 ఏళ్ల హిందూ యువతి హత్యకు గురైంది. ఈ హత్య తర్వాత సక్కర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ''ఈ సంఘటన తర్వాత పూజ ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. ఇప్పుడు మా అందరి హృదయాలలో స్థానం సంపాదించుకుంది'' అని పూజ కుమారి సమీప బంధువు అజయ్ కుమార్ బీబీసీతో అన్నారు. తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారని, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హత్య చేశారని పూజ తండ్రి ఆది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 
ఈ అంశంపై పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నారని, సంఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తారని అధికారులు వెల్లడించారు. పూజ హత్యను స్థానిక హిందువులు మాత్రమే కాకుండా, ఆ ప్రాంతంలోని ముస్లింలు కూడా ఖండించారని, తమ సంతాపాన్ని తెలియజేశారని, ఆమె కోసం ప్రార్ధనలు చేశారని పూజ బంధువు అజయ్ కుమార్ చెప్పారు.

 
‘పిరికివాళ్లు హత్య చేశారు’
పూజ ఎంతో ధైర్యవంతురాలని, అందరితో కలివిడిగా ఉండేదని, ఆమె ఉండే ప్రాంతంలో అందరికీ ఆదర్శంగా ఉండేదని అజయ్ కుమార్ చెప్పారు. "పూజ అంటే ఈ ప్రాంతంలో అందరికీ ఇష్టం. అందరిని గౌరవించేది. తల్లిదండ్రులకు ఎలా ఆసరాగా ఉండాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి చాలా నిరాడంబరంగా, ధైర్యంగా ఉండేది'' అన్నారాయన. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆమె ఇంటికి సమీపంలోనే ఉండేవాడని, ఆయన డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తని, కానీ పూజ కుటుంబం పేద కుటుంబమని అజయ్ కుమార్ చెప్పారు.

 
నిందితుడు పూజ కుమారిని చాలాకాలంగా వెంబడిస్తున్నాడని, నిత్యం ఆమెను వేధించేవాడని తెలిపారు. నిందితుడు అంతకుముందు మార్కెట్‌లో పూజతో అనుచితంగా ప్రవర్తించాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందినట్లు అజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు బెయిల్‌‌పై ఉన్నాడని వెల్లడించారు. పూజ తండ్రి ఇంట్లో లేనిది చూసి నిందితుడు మరో ఇద్దరు సహచరులతో కలిసి ఆమె ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని అజయ్ కుమార్ వెల్లడించారు. "కానీ పూజా చాలా ధైర్యంగా వారిని ఎదుర్కొంది. ఆ సమయంలో పూజ కుట్టు పనిచేస్తోంది. అక్కడే ఉన్న కత్తెరతో వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అయితే నిందితులు పూజను పిస్టల్‌తో కాల్చి చంపారు'' అని ఆయన తెలిపారు.

 
'తను నా కూతురు కాదు కొడుకు'
తనకు ఆరుగురు కూతుళ్లని, కొడుకులు లేరని పూజ కుమారి తండ్రి బీబీసీకి తెలిపారు. "జీవితంలో పూజకి ఏదీ నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంటి ఖర్చుల నుంచి, స్కూలు ఫీజుల వరకు అన్నీ తనే చూసుకునేది. ఇంట్లో ఉంటూ పని చేసి డబ్బు సంపాదించేది" అని పూజ తండ్రి ఆది వెల్లడించారు. పూజ తన పెద్ద కూతురని చెప్పిన ఆయన, చిన్న వయస్సు నుంచే ఆమె తనకు సహాయం చేస్తుండేదని అన్నారు. తన కోసం ఏదీ అడిగేది కాదని ఆయన వెల్లడించారు.

 
"కొంచెం పెద్దయ్యాక నేను నీ కొడుకునవుతా. నీతోపాటు పనికి వస్తా అనేది. కానీ ఆమెకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు ఎంబ్రాయిడరీ కోర్సు నేర్పించాను'' అని ఆది తెలిపారు. ''ఆమె ఎంతో చక్కగా కుట్టుపని చేసేది. ఆమె దగ్గర దుస్తులు కుట్టించుకున్నవారు మళ్లీ మళ్లీ వస్తుండేవారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ తన చెల్లెళ్లను స్కూల్లో చేర్పించింది. నాకు ఆర్థికంగా సాయంగా ఉండేది'' అని ఆయన వెల్లడించారు.

 
నా చెల్లెళ్లకి నేనే అన్నను, నీకు కొడుకును అంటుండేదని సాహిబ్ తెలిపారు. నేను ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తనకు ఎలాంటి భయం ఉండేది కాదని, ఇంటిని ఆమే చూసుకునేదని పూజా తండ్రి చెప్పారు. ''నాకు వయసు అయిపోయినా పూజ నాకు అండగా ఉండేది. ఇప్పుడు నేను మళ్లీ బలహీనుడినయ్యాను'' అన్నారు పూజ తండ్రి ఆది.