శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (15:48 IST)

భారత్ విదేశాంగ విధానం సూపర్బ్ : పాక్ ప్రధాని ప్రశంసలు

భారత్ విదేశాంగ విధానంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు వర్షం కురిపించారు. భారత్ విదేశాంగ విధానం సూపర్బ్ అంటూ కొనియాడారు. ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా పలు రకాల ఆంక్షలు విధించిందని గుర్తు చేశాయి. అయినప్పటికీ రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుని స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరించిందని అన్నారు. ఈ విషయంలో భారత్‌ను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
క్వాడ్ కూటమిలో భారత్ ఓ భాగస్వామిగా ఉందన్నారు. దీంతో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తుందన్నారు. కానీ, భారత్ తమ దేశ ప్రయోజనాలకే కట్టుబడి రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. అలాగే, పాకిస్థాన్ కూడా తమ ప్రయోజనాలకే పాటుపడుతుందని, తానెవరికీ తలవంచనని, దేశాన్ని కూడా తలవంచనివ్వనని తేల్చి చెప్పారు.
 
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యితిరేకంగా పాకిస్థాన్ మద్దతు కావాలన్న యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల మాటలకు తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. యూరోపియిన్ యూనియన్ ప్రతినిధుల మాటల వల్ల పాకిస్థాన్‌కు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.