బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (14:38 IST)

అటవీ శాఖలోని 800 ఖాళీలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ... మంత్రి శిద్ధా రాఘవరావు

అమరావతి : ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనం-మనం కార్యక్రమంలో 27 కోట్ల మొక్కలు నాటించామని అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నవంబరు 23 నాటికి వనం-మనం ప్రారంభించి 127 రోజులు అవుతుందని, ఆ రోజు జరిగే వనం-మనం ముగింపు కార్యక్రమంతోపాటు, కార్తీక వన సమారాధన మహోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని మంత్రి వివరించారు. వనం-మనం ముగింపు కార్యక్రమం ఏ జిల్లాలో నిర్వహించాలనేది నిర్ణయించాల్సి ఉందన్నారు.
 
అటవీ శాఖలో ఉన్న 800 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు శిద్ధా ప్రకటించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. చెట్లు పెంపకం, వాటి పరిరక్షణ, అడవులపై అవగాహన కల్పించేందుకు ప్రతి శనివారం ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు మంత్రి శిద్దా ప్రకటించారు. జులై 14వ తేదీ నుంచి నేటి వరకు 6283 వనం-మనం కార్యక్రమాలు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. 
 
ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛంధ సంస్థలు, విద్యార్ధులు, ఎన్జీవోలు, వివిధ సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. విస్తృతంగా మొక్కలు నాటడం వల్ల గత ఏడాది ఏపీకి జాతీయ అవార్డు వచ్చిందని, 2029 నాటికి 50 శాతం పచ్చదనం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ట్రెంచెస్, చెక్ డ్యాములను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.  చెట్ల మధ్య ఇళ్లు ఉండాలన్న సీఎం ఆలోచనల మేరకు నగరవనాలు, పల్లెవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.