బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (08:22 IST)

అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?..హైకోర్టు

టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ఈ విషయంలో గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసి తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండ మోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఎటువంటి అనుమ తులు తీసుకోకుండా అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు చేస్తున్నారని, అలాగే రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ ఛార్జీలు ఎగవేశారంటూ గతంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనం ముందుంచారు. నిబంధనలకు విరుద్ధంగా యరపతినేని భారీ ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని తేలిందని ఏజీ చెప్పారు.

ఈ వ్యవహారంలో 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 24 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వేగంగా ఎందుకు సాగడం లేదని ప్రశ్నించింది. పలు శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోందని, మనీలాండరింగ్‌ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సి ఉందని శ్రీరామ్‌ వివరించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేస్తే సాంకేతిక అంశాల్లో కూడా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని ఎందుకు కోరకూడదని ధర్మాసనం ప్రశ్నించింది.

కోర్టులో ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా, తాము అలా కోరడం సబబు కాదని ఏజీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడానికి తమ ముందున్న వ్యాజ్యమే అడ్డమని భావిస్తే, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.