శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:41 IST)

మల్లెపూలు ఘొల్లుమంటున్నాయ్

వేసవి కాలం వచ్చిందంటే మల్లెపూలనం చూడని కళ్లు, వాటి వాసన పీల్చని ముక్కు ఉండదంటే అతిశయోక్తి కాదేమో! అయితే కరోనా దెబ్బకు వాటివైపు చూసేవారు లేక.. అవి ఘొల్లుమంటున్నాయి.

మల్లెపూలకు ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. పండగలు, పెళ్లిళ్ల సమయంలో డిమాండ్‌ మరింత పెరుగుతుంది. కరోనా ప్రభావంతో పూల ఎగుమతి నిలిచిపోయింది. కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. లాభాలు వస్తాయని ఆశించిన రైతు తీవ్ర నిరాశకు లోనవుతున్నాడు.

కర్నూలు జిల్లాలో సుమారు 6,250 ఎకరాల్లో మల్లె సాగవుతోంది. రోజూ 20 టన్నుల పూలు ఉత్పత్తి అవుతుంటాయి. ఒక్క చాగలమర్రి నుంచే దాదాపు ఎనిమిది టన్నుల పూలను తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

పూలు వాడిపోకుండా ప్రత్యేక బాక్సుల్లో వీటిని తరలిస్తుంటారు. సీజన్‌లో కిలో మల్లెపూలకు రూ.500 ధర లభిస్తుంది. అన్‌ సీజన్‌లో కిలో రూ.100 ఉంటుంది. కరోనా ప్రభావంతో రవాణా వ్యవస్థ స్తంభించడంతో వ్యాపారులు పూలను కొనుగోలు చేయడం లేదు.

దీంతో, పూలను కోయడానికి అయ్యే కూలీల ఖర్చును భరించలేక పూలను రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. సుమారు పది వేల మంది కూలీలకు పని లభించడం లేదు. చాగలమర్రి మండలంలో రోజుకు రూ.లక్ష, కల్లూరు మండలంలో రోజుకు రూ.లక్షన్నర నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.