ఆ ఎస్ఐకి పెళ్లయి నెలరోజులే, ఉద్యోగంలోకి వచ్చేశారు
సమాజమంతా కరోనాకు భయపడుతుంటే కొందరు మాత్రం యోధుల్లా పోరాడుతున్నారు. జనాలకు రక్షణ కవచాల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుటుంబాలను వదిలి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. అందులో కొందరు వీరు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పశ్చిమ గోదావరిజిల్లా కొత్తూరుకు చెందిన బాలక్రిష్ణకు నెల క్రితమే పెళ్లి అయ్యింది. అయితే అప్పుడే ప్రజలకు ఆపద దాపురించింది. ఈ ఆపత్కాలంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు కొత్తూరు ఎస్.ఐ. బాలక్రిష్ణ.
బాలక్రిష్ణకు పెళ్ళి జరిగి నెల గడుస్తోంది. ఇంతలో లాక్ డౌన్ ప్రకటించడం, దీన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించాల్సిన బాద్యత పోలీసులపై పడింది. దీంతో అప్పటి నుంచి బాలక్రిష్ణ నిరంతరం విధుల్లోనే ఉంటున్నారు. నిత్యం తన సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ జనాలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్ ఎలా అమలవుతుందో పర్యవేక్షించేందుకు గస్తీ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మండలమంతా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్తవ్య దీక్షలో గడుపుతున్నారు.