శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (11:51 IST)

కుంగదీసిన మానసిక పరిస్థితి.. కుమార్తెను చంపి.. తల్లి ఆత్మహత్య .. ఎక్కడ?

suicide
తాను అనారోగ్యంబారినపడటంతో మానసికంగా కుంగిపోయిన ఆ తల్లి.. తాను చనిపోతే తన కుమార్తె బాగోగులు చూసుకునేవారు లేకుండా పోతారని భావించింది. దీంతో తన కుమార్తెను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని ప్రసాదంపాడుకు చెందిన తగరం అరుణ్ కుమార్, జోజి రాణి (32) అనే దంపతులకు గత 2015 జూన్ నెలలో వివాహం కాగా, వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. పాపను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో అరుణ్ పని చేస్తున్నారు. రాణి ఇంటి వద్ద ఉంటూ పాపను చూసుకుంటోంది. 
 
వీరి ఇంటికి దగ్గరలోనే జోజి రాణి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. చిన్నారి జెస్సీ వాళ్ల అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. అయితే, గత కొన్ని రోజులుగా రాణి మానసికస్థితి సరిగా లేదు. దీంతో ఆమెకు వైద్యం చేయిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగు కనిపించలేదు. 
 
పైగా, రోజురోజుకు జోజి రాణి మానసికంగా మరింతగా కుంగిపోసాగింది. తనకు చనిపోవాలని ఉందంటూ తల్లిదండ్రుల వద్ద తరుచూగా చెప్పగా, వద్దని, నువ్వు చనిపోతే పాప పరిస్థితి ఏంటంటూ తల్లిదండ్రులు సర్దిచెపుతూ వచ్చారు. గురువారం ఉదయం రోజూలానే భర్తకు భోజనం బాక్సు కట్టి పంపించింది. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్న రాణి, ఛార్జర్ వైరుతో చిన్నారి మెడకు బిగించి ఊపిరాడకుండా చేయడంతో పాప మరణించింది. 
 
అనంతరం వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకుని మెడపై, ఎడమ మణికట్టుపై లోతుగా కోసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై రాణి తండ్రి ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ కాశీవిశ్వనాథ్ చెప్పారు.