ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (15:58 IST)

ఏపీలోనూ సీరియర్ కిల్లర్

కేరళలో జాలీ అనే మహిళ తమ ఆరుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది.

ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ వ్యక్తి వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఐదేళ్లలో ప్రసాదంలో విషం పెట్టి ఎనిమిది మంది ప్రాణాలను తీశాడు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.
 
నాగరాజు మృతితో...
పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ స్కూల్‌లో పనిచేసే పీఈటీ నాగరాజు(49) అక్టోబర్ 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడివున్నాడు. గుర్తించిన స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగరాజు గుండెపోటుతో చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యుల భావించారు. అయితే, ఆయన వెంట తీసుకెళ్లిన రూ. 2 లక్షల నగదుతోపాటు ఒంటి మీద ఉన్న బంగారం మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నాగరాజు విషప్రయోగంతో చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
 
పోలీసులే షాకయ్యారు..
మృతుడి కాల్ డేటా ఆధారంగా చివరి సమయంలో ఎవరెవరు నాగరాజుతో మాట్లాడారో పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి విచారించారు.

పోలీసుల విచారణలో తానే ఆ నేరం చేసినట్లు అంగీకరించాడు. అంతేగాక, నాగరాజుతోపాటు మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
డబ్బున్నవారే టార్గెట్..
ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఈ నిందితుడు తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని పూజల పేరిట నమ్మించేవాడు. ఫలానా పూజ చేస్తే కోటీశ్వరులు కావచ్చని, తానిచ్చిన నాణేన్ని తమ వద్ద ఉంచుకుంటే రాజకీయంగానూ కలిసి వస్తుందని చెప్పేవాడు.
 
విషం కలిపి హత్యలు..
కొద్ది రోజుల తర్వాత అతడు చెప్పినట్లుగా జరగకపోతే వారు అతడ్ని నిలదీసేవారు. అప్పుడు మరో విధంగా మోసం చేసేందుకు మాయమాటలు చెప్పేవాడు.

ఏదో పెద్ద ఆలయానికి తీసుకెళ్లి ప్రసాదం తినిపించేవాడు. అందులో విషం కలిపి ఉండటంతో వారు ప్రాణాలు వదిలేవారు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బు, నగలను తీసుకుని ఇతడు పరారయ్యేవాడు.
 
వరుసగా 8మందిని..
ఇలా ఏలూరులో ముగ్గురిని, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం ఎనిమిది మందిని హత్య చేసి.. వారిపై ఉన్న బంగారు నగలు, డబ్బును దోచుకున్నట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.