గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (07:57 IST)

ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజి అందించాలి: చంద్రబాబు

ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజి అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో వైసిపి స్కామ్ లను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

టిడిపి ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘కరోనా నుంచి రికవరీలో రాష్ట్రం అట్టడుగున ఉండటం బాధాకరం. యాక్టివ్ కేసులలో దేశంలో 5వ స్థానంలో ఏపి ఉండటం ఆందోళనకరం. మరణాల రేటులో 2వ స్థానానికి రాష్ట్రం ఉండటం శోచనీయం. గత నెల రోజుల్లో రాష్ట్రంలో వైరస్ గ్రోత్ రేటు 91.2శాతం, మరణాల్లో 70శాతం గ్రోత్ రేటు ఉండటం గమనార్హం.
 
1) రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వేలాది శాంపిల్స్, కిట్స్ వృధా చేయడం ఘోరవైఫల్యం. ప్రకాశం జిల్లాలోనే 27వేల శాంపిల్స్, కిట్స్ వృధా చేశారు. మిగతా జిల్లాల్లో 2 లక్షల పైగా శాంపిల్స్, కిట్స్ వృధా అయ్యాయి. కరోనా టెస్టింగ్ రిజల్ట్స్ లో కూడా గందరగోళం చేస్తున్నారు. పాజిటివ్ ను నెగటివ్ గా, నెగటివ్ ను పాజిటివ్ గా ఫలితాలతో ప్రజల్లో అయోమయం సృష్టించారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి టెస్టింగ్ రిజల్ట్ ఒక ఉదాహరణ. 

కరోనా వైరస్ నియంత్రణలో, టెస్టింగులలో, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణలో, నాణ్యమైన ఆహారం పంపిణీలో  రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. రిజల్ట్స్ ఇవ్వడానికే 20రోజులు పడితే ఇంకేం నియంత్రిస్తారు వైరస్ ను..? లక్షల పరీక్షలు చేశామని గొప్పలు చెప్పడం కాదు, వైరస్ టెస్టింగ్ రిజల్ట్స్ ఎంత త్వరగా ఇస్తున్నారు..? వారాల తరబడి టెస్టింగ్ రిజల్ట్స్ లో జాప్యం వల్లే ఏపిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీనికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 
 
రాష్ట్రంలో కరోనా చికిత్సపై వైసిపి మంత్రులకే  నమ్మకం లేదు. డిప్యూటి సీఎం అంజాద్ బాషా, తిరుపతి ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట. మృత దేహాలను ప్రొక్లెయిన్లతో విసిరేయడం, అంబులెన్స్ లు రాక నడిరోడ్డు మీదే మరణాలు వైసిపి వైఫల్యాలకు నిదర్శనాలు.
 
ట్రంప్ లాంటి వ్యక్తే చివరికి మాస్క్ ధరించారు, మాస్క్ కూడా పెట్టుకోని జగన్ ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు..? 
2) క్వారంటైన్ సెంటర్లలో నాసిరకం భోజనం పంపిణీని ప్రజలే నిరసిస్తున్నారు. రోజుకు ఆహారం కింద రూ 500 చెల్లిస్తున్నా కంపుగొట్టే ఆహారం అందించడం అమానుషం. క్వారంటైన్ సెంటర్లలో రోగులకిచ్చే ఆహారంలో కూడా అవినీతికి పాల్పడటం గర్హనీయం.

టిడిపి ప్రభుత్వం అన్నా కేంటిన్లలో అతి తక్కువ ధరకే నాణ్యమైన శుచికరమైన భోజనం అందిస్తే, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు కూడా వైసిపి ప్రభుత్వం సరైన ఆహారం అందించక పోవడం ఘోర వైఫల్యం. ఈ పరిస్థితుల్లో టిడిపి ప్రభుత్వం ఉంటే ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేది, ముందు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచేది, ఉపశమన చర్యలు చేపట్టేది, బాధితులకు అండగా ఉండేదనే భావన ప్రజల్లో ఉంది. 
 
టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మాస్క్ లు అడిగిన డాక్టర్లపై దాడులు చేసే పరిస్థితి ఉండేదా..? పిపిఈల కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది ధర్నాలు చేసే దుస్థితి ఉండేదా..? క్వారంటైన్ కేంద్రాల్లో ఆకలి కేకలు ఉండేవా..? నాసిరకం ఆహారం క్వారంటైన్ కేంద్రాల్లో పంపిణీ జరిగేదా..? అనేదానిపై అన్నివర్గాల్లో ప్రజల్లో చర్చ జరుగుతోంది. 

కరోనా నియంత్రణ కన్నా కక్ష సాధించడంపైనే వైసిపి దృష్టి పెట్టింది. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి, తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తోంది. తప్పులను చెబితే దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు, దాడులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. 

3) కరోనా లాక్ డౌన్ లతో లక్షలాది వలస కార్మికులు, చేతివృత్తులవారు, భవన నిర్మాణ కార్మికులు, రోజుకూలీలు ఉపాధి కోల్పోయారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినా రాష్ట్రం నుంచి అదనంగా చేసిన సాయం శూన్యం. ప్రతి పేద కుటుంబానికి రూ5వేలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేసినా స్పందన లేదు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజి తీసుకున్నారు గాని, రాష్ట్రం నుంచి అదనంగా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదు. 

పనులు లేక ఆదాయం కోల్పోయిన పేదలకు అండగా ఉండాల్సిన సమయం ఇది.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పేదలకు మద్దతుగా వచ్చే వారం రోజుల్లో వర్ట్యువల్ ఆందోళనలు జరపాలి.
 
4) ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, మెరక వేయడంలో, నరేగా నిధుల వినియోగంలో భారీ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ9వేల కోట్లలో రూ5వేల కోట్లు స్వాహా చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల భూసేకరణలో రూ2వేల కోట్లు, లెవెలింగ్ లో రూ3వేల కోట్ల దోపిడీ చేశారు. వైసిపి స్కామ్ లపై వచ్చే వారం రోజుల్లో వర్ట్యువల్ ఆందోళనలు జరపాలి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రజా సమస్యలపై ఆందోళనల్లో పాల్గొనాలి. ‘టిడిపిపై దాడులు చేయడం-రాష్ట్రాన్ని లూటీ చేయడమే’ సింగిల్ పాయింట్ గా వైసిపి పెట్టుకుంది.
 
5) గత ఏడాదిలోనే 42శాతం అప్పులు ఏపి పెంచిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. విదేశీ ట్రస్ట్ నుంచి అప్పులకు అనుమతించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వైసిపి ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను ఎలా తలకిందులు చేశారో ఈ 2అంశాలే సాక్ష్యాలు. రూ16వేల కోట్ల లోటులో, రూ32వేల కోట్ల పెండింగ్ బిల్లుల భారం ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని టిడిపి అభివృద్ది బాటలో నడిపింది. 

అప్పులను మించిన ఆస్తులను టిడిపి సృష్టించింది. తద్వారా ఏపిని అభివృద్ది పథంలో నిలబెట్టింది. 23నీటిపారుదల ప్రాజెక్టులు, 24వేల కిమీ సిమెంట్ రోడ్లు, 10లక్షల ఇళ్ల నిర్మాణం జరిపింది. కానీ వైసిపి ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ స్వాహా చేసిందే తప్ప రూపాయి ఆస్తుల కల్పన జరపలేదు. రాష్ట్రంలో అభివృద్ది పనులన్నీ ఆపేశారు, పేదల సంక్షేమంలో కోతలు పెట్టారు, టిడిపి వెల్ఫేర్ స్కీములను రద్దు చేశారు. పోలవరం పనులు, అమరావతి పనులు, వివిధ జిల్లాలలో ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు. 

అవినీతికి అవకాశం ఉన్నచోటే అప్పు తెచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారు. వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. 
పేదలపై ప్రేమ ఉంటే టిడిపి కట్టిన ఇళ్లు వాళ్లకు ఎందుకు ఇవ్వరు..? పెండింగ్ హవుసింగ్ బిల్లులు పేదలకు చెల్లించడంలో 14నెలల జాప్యం ఎందుకు..? పేదల సంక్షేమంపై వైసిపికి చిత్తశుద్ది ఉంటే అసంపూర్తి ఇళ్లన్నీ పూర్తిచేసేది, ఉచితంగా ఇళ్లు ఇస్తామన్న హామీ నిలబెట్టుకునేది. తప్పుడు ప్రచారంలో వైసిపి రాటుతేలింది. వైసిపి అబద్దాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. 
 
6) విశాఖలో రాంకీ ఫార్మాసిటిలో నిన్న మరో దుర్ఘటన చోటు చేసుకుంది. 15రోజుల్లో 2 దుర్ఘటనలు, 2నెలల్లో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మిన్నాస్తిగా వ్యవహరిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఉదంతం, సాయినార్ కెమికల్స్, రాంకీ ఫార్మా సిటీలో విశాఖ సాల్వెంట్స్ లో వరుసగా దుర్ఘటనలు జరిగాయి. బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా కంపెనీలకే వైసిపి వత్తాసు పలుకుతోంది. ప్రమాదాల నివారణపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయం.

తమ వైఫల్యాలకు టిడిపిపై నిందలు వేయడం వైసిపి నాయకులకు దురలవాటుగా మారింది.  వైసిపి రెట్టింపు అప్పులు చేసి టిడిపిని నిందించడం, వైసిపి తప్పులు చేసి టిడిపిని నిందించడం, రైతులను వైసిపి దగాచేసి టిడిపిపై నెపం వేయడం, పేదలకు వైసిపి అన్యాయం చేసి టిడిపి వైపు చూపడం పరిపాటి అయ్యింది. వైసిపి దుర్మార్గ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని’’ చంద్రబాబు కోరారు. 
 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.