సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (12:25 IST)

నన్ను కెలకవద్దు.. కెలికారో.. మీ బొక్కలన్నీ బయటపెడతా : శివాజీ

బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావుతో పాటు ఆ పార్టీ నేతలపై సినీ నటుడు శివాజీ విమర్శలు విమర్శలు గుప్పించారు. నన్ను కెలకవద్దు.. కెలికారో.. మీ బొక్కలన్నీ బయటపెడతా అంటూ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ దరిద్రపు కాలును ఏపీలో పెట్టారు కాబట్టే తాను కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నానని ప్రకటించారు. 
 
ఈ రాజకీయ తీవ్రవాదిని దేశం నుంచి బహిష్కరించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. రాఫేల్ కుంభకోణం, రైతుల ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మోడీ తినేశారని ఆరోపించారు. మోడీ పర్యటనను అడ్డుకుంటే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని బీజేపీ నేత జీవీఎల్ చెప్పడాన్ని శివాజీ తప్పుపట్టారు.
 
అదేసమయంలో ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు నిరసనగా అధికార టీడీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీనటుడు శివాజీ విజయవాడలోని కృష్ణా నదిలో జలదీక్షకు దిగారు. నడుము లోతు నీటిలో దిగి ప్లకార్డులతో మోడీ గో బ్యాక్, మోడీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. మోడీ రాకతో ఏపీ అపవిత్రమైనదని అందువల్లే తాను కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టనట్టు తెలిపారు.
 
'నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నన్ను కెలకవద్దు. నన్ను కెలికితే మీ బొక్కలు మొత్తం బయటపెడతా' అని శివాజీ రాజకీయ నేతలను హెచ్చరించారు. మోడీ ప్రధాని కాదనీ, ఆయన రాజకీయ తీవ్రవాది అని విమర్శించారు. దేశంలో దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికే ఆయన వచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ, దాని అనుబంధ పార్టీలు ప్రజలను మోసం చేశామని అనుకుంటున్నాయనీ, ప్రజలు అమాయకులు కాదని స్పష్టం చేశారు.
 
మోడీ కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేవరకూ తన జలదీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, శివాజీ దీక్షకు ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.