కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని రకాల అనుమతులు: జగన్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.
స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో అనుసరించాల్సిన వ్యూహాలను సమావేశంలో చర్చించారు. ఎలాంటి ఉత్పత్తులు చేస్తే డిమాండు ఉంటుంది, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభిస్తుంది.. తదితర అంశాలను ఇందులో విస్తృతంగా చర్చించారు.
ఉత్పత్తులకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణంలో వివిధ దశలను ఎలా ప్రారంభించాలన్న దానిపైనా చర్చించారు.
ప్రఖ్యాత ఉక్కు తయారీ సంస్థల భాగస్వామ్యం, దీని కోసం జరపాల్సిన సంప్రదింపుల పైనా సమావేశంలో చర్చ జరిగింది.
ఉక్కు రంగంలో ప్రముఖుడు, సెయిల్ మాజీ సీఎండీ సీఎస్.వర్మ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రితో మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఉన్న పరిస్థితులను సమావేశంలో చర్చించారు. ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించారు. కడప స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామ్యానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తాయని వర్మ చెప్పారు.
జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఈలోగా చేయాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్లాంట్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని నిర్మాణం కోసం సిద్ధం చేయడం చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై దృష్టి పెడితే.. సమయం చాలా ఆదా అవుతుందని సీఎం ఆదేశించారు. ప్లాంట్ కోసం అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవాలని సీఎం పేర్కొన్నారు.