సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:44 IST)

అడుగుకో గుంత.. గజానికో గొయ్యి : ఇదీ ఏపీ రోడ్ల దుస్థితి ... పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో స్పందించారు. అడుగుకో గుంత... గజానికో గొయ్యిలా ఏపీ రోడ్ల దుస్థితి ఉందని వెల్లడించారు. 
 
ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ది చెందాలంటే రహదారుల వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని ఆయన అన్నారు. అందుకే ప్రధాని మోదీగారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఏపీలో మాత్రం వైసీపీ పాలనలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, నివర్ తుఫాను సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైందని గుర్తుచేశారు. 
 
రోడ్లు బాగు చేయండి మహాప్రభో అంటూ గ్రామస్థులు కోరుతంటే.. పోలీసులతో లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయని పవన్ మండిపడ్డారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని... ఈ రోడ్లు దెబ్బతిన్నా బాగు చేయడం లేదని దుయ్యబట్టారు.
 
రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే... అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని చెప్పారు.