జనసేనాని ప్రసంగాన్ని స్వాగతించిన అమరావతి రాజధాని ఐకాస
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో పార్టీ అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా, ఏపీలోని అధికార వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కోరుకునే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, నేతల స్వాగతిస్తున్నారు. ఇపుడు ఆ జాబితాలో అమరావతి రాజధాని ఉద్యమ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) కూడా చేరింది.
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని, ఈ విషయాన్ని అమరావతి రైతులకు జనసేన పార్టీ తరపున హామీ ఇస్తున్నట్టు పవన్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ఐకాస స్వాగతించింది. పవన్ కళ్యాణ్ రాజధాని ఆకాంక్షపరుల మనసులను గెలుచుకున్నారంటూ ప్రకటించింది. పవన్ ప్రసంగం రాజధాని ఉద్యమకారుల్లో ధైర్యాన్ని నింపిందని పేర్కొంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపింది.
సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని పవన్ స్పష్టం చేశారని, ఈ వ్యాఖ్యలతో రాజధాని ఆకాంక్షపరుల మనసులను గెలుచుకున్నారని పేర్కొంది. పవన్ కళ్యాణ్ మాటలు అమరావతి పరిరక్షణ ఉద్యమకారుల్లో ధైర్యాన్న నింపాయని పేర్కొంది. బిల్డ్ అమరావతి పోరాటానికి పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటాయని ఆశిస్తున్నామని ఐకాస నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.