విజయవాడలో రూ.100 కోట్లతో అమృత్ ధార! 24X7 !!
విజయవాడ నగరంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని అందించేందుకు వంద కోట్ల రూపాయలతో అమృత్ పథకానికి శ్రీకారం చుట్టారు.
విజయవాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.100.07 కోట్లతో అమృత్ పథకానికి శ్రీకారం చుట్టిన్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
విజయవాడలోని ఐనాక్స్ థియేటర్ వెనుక సాంబమూర్తి రోడ్డులో అమృత్ పథకంలో భాగంగా 24X7 మంచి నీటి సరఫరాను పథకానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, ఆవుతు శ్రీశైలజారెడ్డి, పలువురు నగరపాలక సంస్థ కార్పొరేటర్లలతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ, నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు నగరపాలక సంస్థ నిధులతో ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా నగరంలో 29 వార్డులకు 24గంటలపాటు మంచినీటి సరఫరాను అందిస్తామన్నారు.
విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఈఈ శ్రీనివాసు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏడిహెచ్ జె.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.