జలదిగ్బంధంలో అనంతపురం శివారు ప్రాంతాలు
అనంతపురం జిల్లా ప్రకృతి విపత్తులో చిక్కుకుంది. కుంభవృష్టి కారణంగా అనంతపురం జిల్లా శివారు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయాయి. మొత్తం 20 కాలనీ వాసులు ప్రమాదపుటంచున్న ఉన్నారు.
మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు కురిసినప్పటికీ ఏనాడూ ఈ తరహా పరిస్థితి ఏర్పడలేదు. కానీ, ఇపుడు దాదాపు 20కి పైగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకునిపోయాయి.
వీరిని ప్రకృతి విపత్తుల శాఖ జిల్లా సిబ్బంది రక్షిస్తున్నారు. నగరంలోని 20 కాలనీల్లో నడిమివంక ప్రవాహ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ఇళ్లలోనే ఉండిపోయిన వారిని విపత్తు నిర్వహణ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగంగా చేపట్టారు.
ఇప్పటివరకు వెయ్యి మందిని ముంపునకు గురైన ఇళ్ల నుంచి రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముంపు ప్రాంతాల్లోని ఇళ్లనుంచి రక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రవాహ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బందిని, పొరుగు జిల్లాల సిబ్బందిని పిలిపిస్తున్నామంటున్న విపత్తుల నిర్వహణశాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు తెలిపారు.
కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అనంతపురం అతలాకుతలమైంది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 20 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని ఐదు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది.
ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. వరదనీరు ఇళ్లలోకి చేరుకోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు. తలదాచుకునేందుకు కూడా నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిమాపక దళాలు, పోలీసులు నిన్న తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతపురం పరిధిలో ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలోనూ ఇంతకుమించిన వానలు కురిసినా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని బాధితులు చెబుతున్నారు.