ప్రమాదకర స్థాయిలో గంగా - యమున నదులు - నీట మునిగిన ఉత్తరభారతం
ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఈ ప్రాంతంలోని అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, గంగా, యమున నదులు ప్రమాకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో త్రివేణి సంగమమైన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ నీట మునిగింది.
ఇరు నదులు ఉప్పొంగి ప్రవహించటం వల్ల ప్రయాగ్రాజ్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దరగంజ్, సలోరి, బఘద, రాజ్పుర్, నైనీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో మొదటి అంతస్తు నీటిలో మునగటం వల్ల పైఅంతస్తులో తలదాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
అనేక ప్రాంతాల్లోని వీధులన్ని నీట మునిగాయి. దీంతో వరద బాధితులను వీధుల నుంచి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో గంగా నది 84.73 మీటర్ల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు యమునా నది నైనీలో 83.88 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో ఉత్తరభారత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.