1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (15:09 IST)

అనంతపురం వరద సహాయక కమిటీ... బాధితుల అవ‌స‌రాల‌ను బ‌ట్టీ...

రాయలసీమ వరద బాధితులకు నిత్యావసర, గృహావసర వస్తువులను అందించేందుకు ‘అనంతపురం వరద సహాయక కమిటీ’ కడప జిల్లా నందలూరుకు బయలుదేరింది. ‘‘మన కోసం మనం’’ నినాదంతో గతకొన్ని రోజులుగా దాదాపు రూ.5,00,000/- కమిటీ సేకరించింది. ఈ డబ్బును రెండు భాగాలుగా విభజించి, అనంతపురం, కడప జిల్లాల్లోని వరద బాధితులకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసింది. ప్రజల వద్ద నుంచీ బియ్యం, దుస్తులు, ఇతర సరుకులను కూడా సేకరించి, కడప జిల్లా నందలూరుకు గురువారం సాయంత్రం కమిటీ పయనమైంది. రెండు రోజుల్లో కదిరికి కూడా ఒక బృందం బయలుదేరుతుందని కమిటీ తెలిపింది. 
 
 
అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, పెన్షనర్ సంఘాలు, లాయర్లు ఒక కమిటీగా ఏర్పడి, ‘మన కోసం మనం’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి, రాయలసీమ వరద బాధితులను ఆదుకోవాలంటూ గతకొన్ని రోజులుగా పనిచేసింది. గత నవంబర్ నెలలో వచ్చిన వరదలకు అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, కడప జిల్లాలోని తోగూరుపేట, పూలపుత్తూరు, మందపల్లి ఇతర గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయి, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తుకు స్పందించిన అనంతపురం రచయితలు, ప్రజాసంఘాలు గతంలో కదిరి, కడప జిల్లాలో రెండు బృందాలుగా పర్యటించారు. 
 
 
అక్కడి బాధితులతో మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకున్నాకున్నారు. పర్యటన అనంతరం కమిటీ కన్వీనర్ జయరామప్ప ఆధ్వర్యంలో బాధితులకు ఏమేంకావాలో అధ్యయనం చేసి, ఒక రిపోర్టు తయారుచేశారు. వారి అవసరాల మేరకు అనంతపురం నగర వీధుల్లో తిరిగి, ప్రజల వద్దనుంచీ విరాళాలు, బట్టలు, వస్తువులు సేకరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్పటికే చాలామంది ప్రజలు పెద్దఎత్తున తక్షణ సహాయక కార్యక్రమాలు చేస్తుండటంతో అనంతపురం కమిటీ కొన్నాళ్లు ఆగింది.
 
 
 తక్షణ ఉపశమన కార్యక్రమాలు అయ్యాక, ఇంకా మిగిలిపోయిన బాధితుల అవసరాలను అక్కడి పాఠశాల ఉపాధ్యాయులతో సంప్రదించి తెలుసుకుంది. ప్రస్తుతం బాధితులకు అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేసి, వరద సహాయక కమిటీ నందలూరుకు బయలుదేరింది. పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయేముందు ఫోన్ ద్వారా సమాచారం అందించి, వందలాది ప్రాణాలు కాపాడి, అన్నీపోగొట్టుకుని వీధినపడ్డ రామయ్యను సన్మానిస్తామని, ఆయనకు 40వేల రూపాయల చెక్‌ను అందిస్తామని కమిటీ తెలిపింది.