గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (19:07 IST)

రాయ‌ల‌సీమ‌లో అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నేతలు నంద్యాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు బి. శ్రీరాములు, రామకృష్ణ, రాజు నాయుడు రామచంద్రుడు ఓబులేసు వెంకట్ రియాజ్ నాగరాజు  రమణ లు మాట్లాడుతూ, శ్రీ బాగ్ ఒప్పందం అమలు జరగకుండా రాష్ట్రంలోని అన్నిరాజకీయ పార్టీలు కుట్ర  చేస్తున్నాయని అన్నారు. రాయలసీమలో ఉన్న అన్ని పార్టీల నేతలు అమరావతి జపం చేస్తూ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
శ్రీశైలం ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా రైతులు 85 వేల ఎకరాలు భూమిని కోల్పోతే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని అమరావతి, కోస్తాంధ్ర ప్రాంత రైతులు వినియోగించుకుంటున్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన అనేక మంది రైతులకు నేటికీ ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు.  అమరావతి రైతులు నష్ట పరిహారం, ఉద్యోగాలు మరియు భూములు కావాలని అడగకుండా అమరావతి రాజధాని కావాలని అడగడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు.
 
 
 రాయలసీమ ప్రజలను అవమానిస్తూ అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుందని అమరావతి రైతులు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తక్షణమే వారి పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి  రద్దు చేయాలని డిమాండు చేశారు. లేకుంటే తామే అమరావతి ప్రాంత రైతులను రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈనెల 26న కర్నూలులో జరిగే రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.