గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (17:48 IST)

సీఎం జగన్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ... అమిత్ షా ముందు ఎస్ఈసీ పంచాయతీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కరోనా లాక్డౌన్ పరిస్థితుల తర్వాత తొలిసారి ఢిల్లీకి సీఎం వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని తెలియవచ్చింది. 
 
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు, మండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వ్యవహారంతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.
 
లాక్డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయినవైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి అక్కడే బస చేసి బుధవారంనాడు ఏపీకి జగన్ తిరుగుపయనంకానున్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
 
ఇకపోతే, సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటన వివరాలను సీఎం క్యాంపు కార్యాలయం విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా వెళతారు. 
 
10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 10.30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ విమానం బయలుదేరనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా జనపథ్‌ - 1కు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జనపథ్ - 1కు చేరుకోనున్నారు.  
 
ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని తెలియవచ్చింది.