బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (10:26 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషకు తెగులు పట్టింది...

invitation press note
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషకు తెగులు పట్టింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కొందరికి గిడుగు రామ్మూర్తి పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ అవార్డు అందించేందుకు మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి ఏపీ మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు వాట్సాప్ ద్వారా ఆహ్వాన పత్రిక పంపారు. 
 
ఇందుకోసం ముద్రించిన 10 వరుసల పేరాతో కూడిన ఆహ్వాన పత్రికలో ఏకంగా తొమ్మిది తప్పులు ఉన్నాయి. కనీసం ఆహ్వాన పత్రికలో అక్షర దోషాలు లేకుండా ముద్రించలేని స్థితిలో తెలుగు అధికార భాషా సంఘంలో పని చేసే వారు ఉన్నారని దీన్నిబట్టి తెలుస్తుంది. దీర్ఘం, గుడి దీర్ఘం, ఒత్తులు కూడా సరిగా రాయని పరిస్థితి. 'గ్రహీత.. తేది.. గౌరవనియులైన.. నిర్వహిస్తున.. ఆహ్వాన్నాని'.. ఇలా దాదాపు ప్రతి వాక్యంలోనూ తప్పులు దొర్లాయి. చివరకు తమ సంస్థ పేరునూ సక్రమంగా రాయక.. 'తెలుగు భాషాభివృధి ప్రాధికార సంస్థ' అన్నారు. మొదట ఇలా పలు తప్పులతో ఆహ్వానపత్రిక పంపించారు. ఇది మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఆ తర్వాత వాటిని సరిచేస్తూ మరో ఆహ్వానపత్రికను పంపించారు.
 
ఇంతకీ ఈ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయబాబు... తేట తెలుగుపై గొప్ప గొప్ప మాటలు చెబుతారు. రాజకీయాలకు అతీతంగా సంఘాన్ని నడిపించాల్సిన ఆయన నిరంతరం సీఎం జగన్ ప్రాపకం కోసం, ఆయన సేవలో పరితపిస్తుంటారు. అందుకే ప్రతిపక్ష నేతలకు తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పిస్తామంటారు. అలాంటి ఆయనకు ఉన్న తెలుగు భాషాపటిమ చూసి తెలుగు భాషాభిమానులు నివ్వెరపోయారు. గిడుగు పురస్కార గ్రహీతలకు ఆయన పంపిన ఆహ్వానపత్రికను చూసి నోరెళ్లబెట్టారు. ఆ పత్రికలో ఒకటి, రెండు కాదు... ఏకంగా తొమ్మిది అక్షర దోషాలతో అతిథులే విస్తుపోయేలా తెలుగుకే తెగులు తెచ్చారు.