గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (09:08 IST)

తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4

leopard
తిరుమల తిరుపతి మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. అలిపిరి - తిరుమల కాలిమార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి చిక్కినట్టు తితిదే అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నాలుగు చిరుత పులులను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను పట్టుకోగా, ఆ తర్వాత రెండు, ఇపుడు మరొక చిరుత పులిని పట్టుకున్నారు. 
 
కాగా, ఈ నాలుగో చిరుత పులిని బోనులో బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కాలి నడక మార్గంలో నడిచివెళుతున్న ఓ చిన్నారిపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. దీంతో అప్రమత్తమైన తితిదే అదికారులు కాలి నడక మార్గంలో పలు రకాలైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, మధ్యాహ్నం 2 గంటలకు పైబడి చిన్నారులు నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే, భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా తితిదే ఇచ్చింది.