విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా!
విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఈ బుడమేరు ఉప్పొంగింది. దీంతో అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. మూడు రోజులు గుడుస్తున్నా వరద నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు. దీంతో అజిత్ సింగ్ నగర్, తదిత కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. సోమవారం డ్రోన్ల్ ద్వారా ఆహార పొట్లాల సరఫరా చేసే విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు వివరించిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం ఆమోదంతో అధికారులు ఈ సాయంత్రం అజిత్ సింగ్ నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌పై ఉన్న ప్రజలకు డ్రోన్ ద్వారా ఆహారం అందించారు. ఆహార పొట్లాల ప్యాకెట్‌లను డ్రోన్ నిమిషం లోపే అపార్టుమెంట్‌పైకి చేరుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సోషల్ మీడియాలో పంచుకోవడం గమనార్హం.
అర్థరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే... బస్సులోనే బస!!
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన విజయవాడ నగర వాసులను రక్షించేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన విజయవడా వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పైగా, ఆయనే స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పరామర్శించడం, వారి సమస్యలను అడిగి తెలుసుకుని కావాల్సిన సాయం అందించడం చేస్తున్నారు.
దీనిలోభాగంగా ముఖ్యమంత్రి సోమవారం రాత్రి 2 గంటల వరకు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. మూడో రోజు సహాయక చర్యలు, వరద నిర్వహణను పర్యవేక్షించిన ఆయన... కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేయడం గమనార్హం. రెండు గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఆయన వెళ్లారు. అటు ఆయన తనయుడు, రాష్ట్ర విద్యామంత్రి నారా లోకేశ్ సైతం అర్థరాత్రి దాటేవరకు కలెక్టరేట్‌లోనే ఉండి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా, బుధవారం కూడా విజయవాడకు అదనపు బలగాలు, సహాయక బృందాలు రానున్నాయి.