ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:10 IST)

ఎన్నికల్లో పోటీ చేశాడనీ వరికుప్పను తగలబెట్టారు!

గుంటూరు జిల్లాలో అధికార వైకాపా పార్టీ నేతలతో కలిసి పోలీసుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు, వారి కుటుంబాలను పోలీసులే స్వయంగా బెదిరిస్తున్నారు. మీ మంచికే చేబుతున్నాం.. పోటీ నుంచి తప్పుకోండి అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. వారి మాటలు వినకుంటే మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారు. 
 
జిల్లాలోని చుండూరు పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కోటిరెడ్డిని నామినేషన్‌ వెయ్య నివ్వకుండా ఊరొదిలి వెళ్లిపోవాలని ఎస్‌ఐ బెదిరించారించిన విషయం తెల్సిందే. దీనిపై ఎన్నికల సంఘానికి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసి ఒక్కరోజు కూడా గడవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వలివేరు అభ్యర్థిని విరమించుకోవాలని, మీ మంచికోసమే చెబుతున్నానంటూ ఓ పోలీసు అధికారి నేరుగా బుజ్జగింపులకు దిగటం విమర్శల కు తావిస్తోంది. ఇదేపరిస్థితి బాపట్ల, చెరుకుపల్లి, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో ఉందని మిగిలిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
చుండూరు మండలంలోనే కె.ఎన్‌.పల్లి పంచాయతీలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఎదురు నామినేషన్‌ వేసిన వారిలో ఒక అభ్యర్థి ఇంటికివెళ్లి వలంటీర్‌ నేరుగా ప్రలోభపెట్టారు. ఈ మంతనాల తతంగం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయటంతో దీనిపై వాడివేడి చర్చలు, ఆరోపణలు సాగుతూ ఉన్నాయి. 
 
మరోపక్క అమృతలూరు మండలం పాంచాలవరంలో టీడీపీ మద్దతున్న అభ్యర్థి పావులూరి చందు అనే రైతునూ బెదిరించారు. తాను కౌలుకు సాగుచేసి వేసిన వరి కుప్పను తగలబెట్టారని, గతంలో లేని కొత్త సంస్కృతి వచ్చిందని, ఎన్నికల్లో పోటీచేస్తే వరికుప్పలు తగలబెట్టటమేంటని అతని సోదరుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. 
 
ఇదే తరహాలో మిగిలిన మండలాల్లోనూ అధికార పార్టీకి ఎదురు నిలుచున్న వారిని హెచ్చరికలతో భయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే రాజీ పడండంటూ ఉచిత సలహాలిస్తున్నారని వారు వాపోతున్నారు.