మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:05 IST)

పంచాయతీ పోల్ : ఓటుకు రూ.5 వేలు అయినా ఫర్లేదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలైనా ఇచ్చేందుకు కొంతమంది అభ్యర్థులు సిద్ధమయ్యారన్న ప్రచారం ఊపందుకొంది. 
 
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం మండలాల్లో ఓసీ, బీసీ వర్గాలకు కేటాయించిన పంచాయతీల్లో పోటీ నెలకొంది. ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో అభ్యర్థులు తమకు ఓటు పడదనే వ్యక్తికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఓటుకు రూ.5 వేలు పంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇకప్పటికే కొన్ని పంచాయతీల్లో నగదు పంపిణీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు కొందరు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో రవాణా చార్జీలు, ఖర్చులకు నగదు జమ చేయడంతోపాటు ఓటుకు రూ.3 నుంచి రూ.4 వేలు వేసినట్లు తెలిసింది. 
 
సర్పంచుగా విజయం సాధించాలనే తపనతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు పొలాలు, ప్లాట్లు వడ్డీకి తాకట్టు పెడుతుండగా, మరికొందరు ఏకంగా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.