ఆంధ్రాలో పోలీసుల బీమా పెంపు...
పోలీసు బీమా మరింతగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్‌లో పెరుగుదల కనిపించింది.
గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్ వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ.45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4.74 కోట్లను చెల్లించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తోపాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ.30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ.40 లక్షల రూపాయలను అందిస్తూ కొన్నిరోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు.
ఇందులో 64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.