ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీ.. మార్గదర్శకాలు ఇవే
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వృద్ధులకు రాయితీపై ప్రయాణ టిక్కెట్లను జారీ చేయనున్నారు. ఇందుకోసం పాటించాల్సిన మార్గదర్శకాలను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీచేశారు. ఈ మేరకు అన్నిజిల్లాల ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతాలు, రాష్ట్రాలతో పనిలేకుండా 60 యేళ్ళు పైబడిన ప్రతి ఒక్క వృద్ధుడికి ప్రయాణ చార్జీలపై రాయితీ కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
60 ఏళ్లు నిండిన వృద్ధులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 25 శాతం రాయితీని ఆర్టీసీ ఎప్పటినుంచో కల్పిస్తోంది. టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధరణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బందికి, వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు.
ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా.. అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్ధులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రాయితీ టికెట్ల జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలిచ్చింది.
వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని స్పష్టం చేసింది. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే.. ఫోన్‌లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపించినా రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందిని ఆర్టీసీ ఆదేశించింది. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ, అన్ని బస్సుల్లో వృద్ధులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని సిబ్బందికి యాజమాన్యం స్పష్టం చేసింది.