హెరిటేజ్ ఫ్రెష్‌ను తెగనమ్మేశా... 'భారతి' పేరుతో మోసాలు చేయలేదు : చంద్రబాబు

chandrababu naidu
ఠాగూర్| Last Updated: మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:44 IST)
'వ్యవసాయం దండగ' అని తాను అన్నట్టుగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం దండగ అన్న వ్యాఖ్యలు తాను చేసినట్టు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేశారని, నిరూపించమని ఆయనకు సవాల్ విసిరితే మాట్లాడకుండా తప్పించుకున్నారని గుర్తుచేసుకున్నారు. వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు.

అంతేకాకుండా, ఉల్లిపాయ ధరలపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ వేడి పుట్టించింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200కు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఆరోపించారు. ఉల్లిని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోందని... అందుకే రైతు బజార్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం కొత్త కాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు.

దీనికి చంద్రబాబు సభలోనే కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని పలు మార్లు చెప్పినా... అవే మాటలు మాట్లాడటం సరికాదని చంద్రబాబు అన్నారు. దీని గురించి నిన్ననే తాను క్లియర్‌గా చెప్పానని... అయినా, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌కు సవాల్ విసురుతున్నానని... హెరిటేజ్ ఫ్రెష్ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. భారతి సిమెంట్స్, సోలార్ విండ్ పవర్ మాదిరి మీలా తాము మోసాలు చేయలేదని అన్నారు.

"ప్రజా సమస్యలపై నిలదీస్తే వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకోవడం ప్రభుత్వానికి అలవాటయిపోయింది. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉల్లి గురించి అడిగితే హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు. హెరిటేజ్ ఫ్రెష్‌ను ఫ్యూచర్ గ్రూప్‌కి అమ్మేశామని, కాబట్టి మీ ఆరోపణ తప్పని నిన్ననే సభలో ఖండించా.

అయినా మొండిగా దాన్నే పట్టుకుని ప్రజా సమస్యను వదిలేసారు. దేన్నైనా సహిస్తాను గానీ ప్రజల జోలికి వస్తే సహించను. అందుకే నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రికే ఏకంగా సవాలు విసిరా! దమ్ముంటే నా సవాలును స్వీకరించాలి. లేదా సభా సమయాన్ని వృధా చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అంటూ మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :