గుంటూరు జిన్నా టవర్ లో...జిన్నాపేరును తొలగించాలి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. మొన్న చీప్ లిక్కర్ 50 రూపాయలకే అందిస్తామని, కోటి మంది తాగుబోతులు బీజేపీకి ఓటు వేయాలని వీర్రాజు చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే రేపింది. ఇటు ఆంధ్రప్రదేశ్ నేతలే కాదు... అటు తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీయార్ కూడా బీజేపీని ఏకిపారేశారు. ఇపుడు తాజాగా సోము వీర్రాజు మరో వ్యాఖ్య చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చేస్తున్న సందర్భంలో, గుంటూరులోని జిన్నా టవర్ కు... జిన్నా పేరును తొలగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. జిన్నా దేశ ద్రోహి అని, అటు వంటి ద్రోహుల పేర్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని డిమాండ్ చేస్తున్నానని సోము వీర్రాజు అన్నారు.
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఆజాదీగా అమృత మహోత్సవం చేసుకుంటున్న నేపధ్యంలో దేశ ద్రోహుల పేర్లు ఏప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని భారతీయజనతా పార్టీ డిమాండ్ చేస్తోందని సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
స్వాతంత్ర స్పూర్తి పొందాలంటే, సెంటర్లకు, టవర్లకు దేశ ద్రోహుల పేర్లు ఉండకూడదని, అలా ఉంటే భవిష్యత్ తరాలకు ఏమి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం వంటి దేశ భక్తులు, జిల్లాలోని ప్రముఖు ల పేర్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.